: అహంకారులు ఓటమిని ఎదుర్కొంటారు: మోడీపై యూపీ సీఎం వ్యాఖ్య
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అహంకారం ఉన్న నేతలు ఓటమిని ఎదుర్కొంటారని అన్నారు. ఓ ఆంగ్ల చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోడీ పేరును ప్రస్తావించినప్పుడు అఖిలేష్ పైవిధంగా అన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, యూపీ సీఎం అఖిలేష్ కలసి రాష్ట్రాన్ని నాశనం చేశారని కొన్ని రోజుల కిందట మోడీ విమర్శించిన తర్వాత అఖిలేశ్ ధ్వజమెత్తారు. గుజరాత్ సీఎంకు యూపీ జిల్లాల గురించి తెలియదన్నారు. అయితే, రాష్ట్రాల్లో మత పార్టీలు విజయం సాధించడాన్ని ఎస్పీ ఒప్పుకోదన్నారు. కాగా, యూపీలో ముజఫర్ నగర్ అల్లర్లు, సైఫై పండుగ నిర్వహణలో ప్రభుత్వం పని తీరును సమర్థించుకున్నారు.