: శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సిబ్బంది అక్రమాలకు అంతే లేదు..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయ సిబ్బంది అవినీతి, అక్రమాలతో ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. రాహు కేతు పూజల ద్వారా ఆలయ ఖ్యాతి విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ఆలయానికి ఏడాదికి సుమారు 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కింది స్థాయి అధికారి నుంచి ఈవో వరకు బదిలీ అవుతున్నా తీరు మారడం లేదు. రాహుకేతు పూజలకు సంబంధించి కొబ్బరికాయల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆలయాధికారులు కేసులు నమోదు చేయడంతో వివాదం కోర్టుకెక్కింది. ఆలయ భూములకు సంబంధించిన వివాదాలు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. ఆలయంలో ఇప్పుడు 120 కోట్ల వెండి నిల్వలు ఉన్నాయి. వెండి కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రాహుకేతు పూజా సామగ్రి సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వచ్చాయి. స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించే చీరలు, పంచెలను కూడా సిబ్బంది మాయం చేసిన ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి.