: అన్ని పదవులు సీమాంధ్రులకేనా?: రేవంత్ రెడ్డి


సమైక్య రాష్ట్రంలో అన్ని పదవులు సీమాంధ్రులకే కట్టబెట్టారని, తెలంగాణ వారికి పదవుల విషయంలో అన్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్, సీఎం, పీసీసీ చీఫ్, కౌన్సిల్ చైర్మన్ ఇలా అన్ని పదవులను కాంగ్రెస్ సీమాంధ్రులకే కట్టబెడితే.. తెలంగాణ ప్రాంతం వారికి కడుపు మండదా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి పదవుల్లోనూ తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు. పక్కనే కృష్ణా నది పారుతున్నా నల్లగొండ ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడే పరిస్థితి రావడం.. సీమాంధ్ర పాలనలో జరిగిన అన్యాయం కాదా? అని ఆయన నిలదీశారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణలో తాగు, సాగునీటికి నోచుకోని పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. తెలంగాణకు వైఎస్ చేసిన మేలు చిన్నారెడ్డితో సోనియాకు లేఖ ఇప్పించడమేనని ఆయన చెప్పారు. ఇందిరాగాంధీ సమైక్యానికి అనుకూలమని సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. జై ఆంధ్రను తాము వ్యతిరేకించడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News