: రేపటి నుంచి స్మార్ట్ ఓటర్ కార్డుల పంపిణీ
రేపు (జనవరి 25) జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లకు శనివారం నుంచి స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రారంభించనుంది. కాగా, కొత్త ఓటర్ల నమోదు కోసం రాష్ట్రంలో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 76 లక్షల మందికి పైగా ఓటర్లు నమోదు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అయితే, శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు ఉంటే శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నమోదు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఆరు కోట్ల 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. వారి తుది జాబితాను ఈ నెలాఖరుకల్లా విడుదల చేయనున్నట్లు భన్వర్ లాల్ వెల్లడించారు.