: కేంద్రం మితిమీరి ప్రవర్తిస్తోంది...నేరుగా అడగడానికి కేంద్రానికి ఏ అధికారం ఉంది: లగడపాటి
కేంద్ర ప్రభుత్వం మితిమీరి ప్రవర్తిస్తోందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ యూపీఏపై మండిపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పునర్విభజన బిల్లుపై రాష్ట్రానికి గడువు పెంచడానికి కేంద్రానికి నేరుగా ఉన్న అధికారం ఏంటని ప్రశ్నించారు. భారత దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఏ ఒక్కరూ పూర్తి అధికారంతో లేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అన్ని రాష్ట్రాలకు నాలుగు వారాల గడువు ఇచ్చి మన రాష్ట్రానికి ఒక్క వారం గడువు ఇవ్వడం.. కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజలంటే ఉన్న చులకన భావాన్ని చూపిస్తోందని విమర్శించారు.
తెలంగాణను ప్రజలు ఇవ్వమని చెప్పలేదని, కేవలం పార్టీల అధినేతలు మాత్రమే విభజనకు అనుకూలంగా నిర్ణయం చెప్పారని ఆయన గుర్తు చేశారు. పార్టీలు రాష్ట్ర విభజనపై కనీసం ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలనైనా అడగలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం చెప్పినట్టు చేయడానికి ఇక్కడ పనివారు లేరన్న లగడపాటి, కేంద్రానికి నచ్చినట్టు చేస్తూ పోతుంటే.. చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. 'ఎన్నికల్లో లబ్ది కోసం కాంగ్రెస్ అధిష్ఠానం తప్పు చేసింది. అలాంటప్పుడు బిల్లుపై చర్చకు గడువు లేదని చెప్పడానికి మీరెవరు?' అంటూ ప్రశ్నించారు.
శాసనసభ్యులు మూడు వారాలు అదనంగా గడువు కావాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలని ఆయన శాసనసభ్యులకు సూచించారు. శాసనసభలో సభ్యుల మెజారిటీ అభిప్రాయమే సభ అభిప్రాయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. బిల్లుపై చర్చకు అదనపు సమయం కోరుతూ తీర్మానం పంపితే తాము దానిని డిమాండ్ చేసి సాధించుకురావడానికి కుదురుతుందని లగడపాటి తెలిపారు. ఆ ప్రయత్నం చేసి, వీరు దేనికైనా సిద్ధమవుతారనే సంకేతాలు కేంద్రానికి పంపించాలని ఎమ్మెల్యేలను ఆయన డిమాండ్ చేశారు. తాను ఇప్పటికే ముఖ్యమంత్రిని, అనేక మంది మంత్రులు, శాసనసభ్యులను ఈ విషయమై సంప్రదించానని... తమతో కలిసి రావాలని ఇతర పార్టీల నేతలకు కూడా సందేశం పంపించానని తెలిపారు.
ఇకనైనా అందరం కలిసి వ్యూహాత్మకంగా ఏకతాటిపై అడుగులు వేసి బిల్లును అడ్డుకుందామని ఆయన సూచించారు. బిల్లుపై ఓటింగ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం వ్యూహానికి అందకుండా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.