: కాంగ్రెస్ పార్టీని నిలదీశాను: వెంకయ్య నాయుడు
తెలంగాణ అంశాన్ని పార్టీలో చర్చించారా? లేదా? అని కాంగ్రెస్ పెద్దలను అడిగానని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మీ పార్టీలో తెలంగాణ అంశాన్ని మీరు చర్చిస్తే సీఎం, పీసీసీ చీఫ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చిదంబరాన్ని నిలదీశానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి తన ఆవేదనను కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియజేయలేదా? అని ఆయన ప్రశ్నించారు.
ఇది అత్యంత సున్నితమైన అంశమన్న ఆయన, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నదని అన్నారు. సీఎం కాంగ్రెస్ అధిష్ఠానానికి అభ్యంతరం తెలిపినా.. పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదా? అని ఆయన మండిపడ్డారు. పార్టీలో విస్తృత చర్చ జరిగిందంటే అర్థం ఏమిటని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వాదనను పరిగణలోకి తీసుకున్నారా? లేదా? అనే అంశాన్ని సీఎం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సంస్కృతిని సీఎం బయటపెట్టాలని ఆయన సూచించారు.