: గజగజా వణికితే.. చకచకా సన్నబడతారు!


బరువు తగ్గించుకోవాలని మనలో చాలా మంది అనుకుంటాం. తగ్గించుకునేందుకు నానా రకాల తంటాలు పడతాం. తిండి తగ్గించే వాళ్లు కొందరైతే.. ఉదయపు నడక, పార్కుల్లో పరుగులు పెడుతూ సన్నబడే ప్రయత్నం చేసేవారు మరి కొందరు. ఇప్పుడు అలాంటి వారి కోసం నిపుణులు ఓ సలహా ఇస్తున్నారు. చల్లటి వాతావరణంలో కాసేపు గడపండి అని వారు సూచిస్తున్నారు. చల్లటి గాలిలో వున్నప్పుడు శరీర ఉష్ణోగ్రతను పెంచటానికి మన శరీర వ్యవస్థ ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుందని, ఫలితంగా బరువు తగ్గుతుందని చెబుతున్నారు. అందుకే, కార్యాలయంలో కాని, నివాసంలో గానీ ఎప్పుడూ వేడి వాతావరణంలో వుండేవారు బరువు పెరుగుతారని వారు తెలిపారు.

నెదర్లాండ్స్ లోని మాస్ట్రిచ్ట్ వర్సిటీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు కొంత మందిని తీసుకొని ఓ పది రోజుల పాటు వారిపై పరిశోధనలు చేశారు. వారిని ప్రతిరోజూ ఆరు గంటల పాటు 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వున్న గదిలో ఉంచారు. ఆ సమయంలో వారిలో 'బ్రౌన్ ఫ్యాట్' పెరిగినట్టు పరిశోధకులు గుర్తించారు. మామూలు కొవ్వులు క్యాలరీలను భద్రపరిస్తే, ఈ బ్రౌన్ ఫ్యాట్ క్యాలరీలను కరిగిస్తుంది. చలికి శరీరం వణికితే 'బ్రౌన్ ఫ్యాట్' పెరుగుతుందని, దాంతో శరీరం తనలోని శక్తిని ఐదు రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తుందని తేలింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారందరూ కొంత బరువును కోల్పోయారు. అయితే, సుదీర్ఘ కాలం ఈ అలవాటును కొనసాగిస్తే.. ఎటువంటి ప్రభావం ఉంటుందన్న దానిపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. కాబట్టి, గజగజా వణికితే.. చకచకా సన్నబడటం ఖాయం!

  • Loading...

More Telugu News