: అళగిరిపై చర్యలతో ఆసక్తికరంగా మారిన తమిళ రాజకీయాలు


తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కన్నకొడుకు అళగిరిని అన్ని పదవుల నుంచి అధినేత కరుణానిధి సస్పెండ్ చేయడంతో డీఎంకేలో సరికొత్త సంక్షోభానికి తెరలేచింది. తాజా నిర్ణయంతో కరుణానిధి తమిళ నాట రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేశారు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తును అళగిరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు పార్టీలో సీనియర్ అయిన తన కంటే స్టాలిన్ కు పార్టీలో ప్రాధాన్యత పెరగడంపై కినుక వహించారు. దీంతో పార్టీ నిర్ణయాలను ఆయన బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, మధురై ప్రాంతంలో తనకు మద్దతు పలికే నేతలతో అళగిరి ఓ కూటమిగా ఏర్పడ్డారు. దీనిపై డీఎంకే అధినేత, అళగిరి తండ్రి కరుణానిధి మండిపడుతున్నారు. వ్యవహార శైలి మార్చుకోకుంటే పార్టీ నుంచి బయటకు పంపించాల్సి ఉంటుందని ఆయన గతంలో ఘాటుగా హెచ్చరించారు. అయినప్పటికీ అళగిరి తన వ్యవహారశైలిని మార్చుకోకపోవడంతో ఆయనను పదవుల నుంచి సస్పెండ్ చేశారు. మధురై ప్రాంతంలో డీఎంకేకి బలమైన నేతగా అళగిరి ఉన్నారు. పార్టీ పదవుల నుంచి అళగిరిని తొలగించడంతో ఆయన తన మద్దతుదారులతో వేరు కుంపటి పెట్టుకుంటారా? లేక ఏదయినా ఇతర పార్టీలోకి వెళ్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.

డీఎంకేలో వ్యతిరేక చర్యలు, డీఎండీకేతో పొసగకపోవడం, జయలలితతో ఉన్న వైరం నేపథ్యంలో తమిళనాట అళగిరి ఏం చేయనున్నారన్న అంశంపై దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అళగిరిపై తాజా చర్యలు.. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News