: ఎంపీ3 ప్లేయర్ రూ.2, ఎల్ఈడీ టార్చ్ రూ.8!
దేశంలో దొంగలు పడ్డారు! అవును, వారంతా దేశ ఖజానాకు కన్నం వేస్తున్న దొంగ వ్యాపారులు. మనం మార్కెట్లో ఎంపీ3 ప్లేయర్ కొనుక్కోవాలంటే 50 రూపాయలో, 100 రూపాయలో పెట్టాలి. అదీ నాసిరకం వస్తువే. కానీ, ఇదే వస్తువును చైనా నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నది ఒక రూపాయి ఎనబై మూడు పైసలకే. ఎల్ఈడీ టార్చ్, బల్బును 8 రూపాయలకు కొనుగోలు చేస్తూ మార్కెట్లో వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. టాబ్లెట్ పీసీ ఎంతనుకుంటున్నారు..? కేవలం 400 రూపాయలు. మనం కొనుక్కోవాలంటే రూ.4,000కు తక్కువ లేదు.
దోమలను చంపే బ్యాట్ 10రూపాయలే. మనకు 100 రూపాయలకు పైనే అమ్ముతున్నారు. ఎమర్జెన్సీ ల్యాంప్ ను 25 రూపాయలకు కొంటూ 1,000 రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ, ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించడం లేదు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాలో ఇలాంటి నిజాలెన్నో తేలాయి. వ్యాపారులు చైనా నుంచి 3,673 వస్తువులను కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. ఇవే వస్తువులను దేశీయ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తే దేశ ఖజానాకు వేలాది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది.