: సాయిబాబా జహీరాబాద్ వచ్చాడా?
బాబా కారులో వచ్చాడా?.. అంటే అవుననే అంటున్నారు జహీరాబాద్ వాసులు. సాయిబాబాను తలిస్తే చాలు.. తమ ఈతి బాధలన్నీ ఆయన తొలగిస్తాడని కూడా బలంగా నమ్ముతారు. ఆలాంటి వారికి మరింత నమ్మకం కలిగించే సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. జహీరాబాద్ లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈడెన్ కాలనీలోని షిర్డీ సాయి మందిరం దగ్గర ఈ నెల 10న ఉదయం 9 గంటల సమయంలో ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి సాయిబాబా వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి దిగాడు. నేరుగా గుడిలోకి నడుచుకుంటూ వెళ్లి పూజారితో మాట్లాడాడు. సాయి హారతిని కళ్లకు అద్దుకున్నాడు. ఆలయ ప్రాంగణంలో అటు ఇటు తిరుగాడి భక్తులతో నేరుగా ముచ్చటించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంతకీ సాయిబాబా వేషంలో వచ్చిన వ్యక్తి ఎవరన్న దానిపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.