: ఆత్మవిశ్వాసం ఉంటే మరణాన్ని కూడా వాయిదా వేయించొచ్చన్నారు అక్కినేని: మంద కృష్ణ
నటసామ్రాట్ అక్కినేని భౌతికకాయానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక రోజు తాను నాగేశ్వరరావుగారిని కలిశానని... ఆ సందర్భంగా ఆయన ఆరోగ్యం గురించి అడిగానని... ఆయన చెప్పిన సమాధానం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మంద కృష్ణ తెలిపారు. తనకు గతంలోనే గుండెకు ఆపరేషన్ జరిగిందని... అయినా ఏనాడూ తాను డిప్రెషన్ కు గురికాలేదని చెప్పారని... ఆత్మవిశ్వాసం ఉంటే మరణాన్ని కూడా వాయిదా వేయించవచ్చని చెప్పారని మంద కృష్ణ గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఆత్మవిశ్వాసం అంతులేనిదని... ఆయన్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని చెప్పారు. అక్కినేని ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.