: సీఎం ప్రసంగంపై అభ్యంతరాలు చెప్పిన పార్టీల నేతలు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తరువాత జానారెడ్డి సీఎం అభిప్రాయాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుపై ఓటింగ్ ఉండదని తెలిపారు. దీనిపై సీఎం అన్ని విషయాలు రేపు పూర్తిగా మాట్లాడుకుందామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి ఆ ప్రాంత ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతూ గతంలో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తామని సీఎం తెలిపారని గుర్తు చేశారు. అప్పట్లో సీఎం చేసిన వ్యాఖ్యల సీడీని స్పీకర్ కు పంపించారు.
గతంలో ఇందిరాగాంధీ తెలంగాణ సమస్య పరిష్కారం చేస్తానందని, ఢిల్లీ వెళ్లిన తరువాత, అప్పటి నేతలకు పదవులిచ్చి వారిని లొంగదీసుకుందని గుండా మల్లేష్ తెలిపారు. పెళ్లయిపోయిన తరువాత జాతకాలు కుదరలేదని చెప్పినట్టుగానే సీఎం ప్రసంగం కొనసాగిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. అంతర్గత విభేదాలు ఉంటే, ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో తేల్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపేలా సీఎం ప్రసంగం ఉండాలని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. సీఎం చెప్పినది ప్రభుత్వ నిర్ణయంగా చెబుతున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని అన్నారు. ఇది సున్నితమైన అంశమని దీనిపై రూల్స్ లేనప్పటికీ సభ గౌరవాన్ని నిలపాలని ఆయన స్పీకర్ ను కోరారు. సీఎం చిత్తూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యేలా మాట్లాడకూడదని ఆయన సూచించారు.
బిల్లుపై ఒటింగ్ ఉంటుందా? లేదా? అనేది కూడా స్పీకర్ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సభలో చర్చ నడుస్తోందని, అది పూర్తిగా కొనసాగాలని అక్బరుద్దీన్ తెలిపారు. అభిప్రాయవ్యక్తీకరణ పూర్తయిన తరువాతే ఇతరులు అభ్యంతరాలు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం పూర్తి అభిప్రాయాలు చెప్పిన తరువాత బీఏసీ మీటింగ్ పెట్టాలని ఆయన కోరారు. రాష్ట్రపతి వారం రోజులు గడువు పెంచినట్టు సమాచారం ఉందని, ఆ సమయం చర్చకు సరిపోతుందని తాను భావిస్తున్నానని అక్బరుద్దీన్ తెలిపారు.ఈ అభిప్రాయాలన్నింటిపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సీఎం తన అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పలేదని తెలిపారు.
సభకు కొన్ని నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారమే సభ జరుగుతుందని సభాపతి స్పష్టం చేశారు. ఇది క్లిష్టమైన విధానమని, ప్రతి సభకు దాని విధానాలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయాలని స్పీకర్ కోరారు.