: 'కేరళకు దూరంగా వుండండి' అంటున్న ఇటలీ
భారత్ లో ఉంటున్న తమ పౌరులకు ఇటలీ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. దేశంలో ఎక్కడైనా వుండండి కానీ, కేరళ రాష్ట్రంలోకి మాత్రం వెళ్ళకండి అంటూ తమ పౌరులను కోరింది. కేరళ జాలర్ల హత్యకేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న ఇటలీ నావికులు మాసిమిలానో లాతోర్, సాల్వతోర్ జిరోన్, తమ దేశం వెళ్లి ఓటుహక్కు వినియోగించుకుని వస్తామని చెప్పి సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని, తుర్రుమన్న సంగతి మనకు తెలిసిందే.
వారిని ఇక ఇండియా పంపేది లేదని ఇటలీ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించడంతో, మన ప్రభుత్వం ఆగ్రహంగా వుంది. ముఖ్యంగా కేరళ ప్రజలు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారట. ఇటలీ ప్రజలంటేనే వారు మండి పడుతున్నారట. ఈ నేపథ్యంలో ఇటలీ వాళ్ళు ఎవరు కనిపించినా, అక్కడి ప్రజలు రెచ్చిపోయే ప్రమాదముందని భావించిన ఇటలీ ప్రభుత్వం, తాజాగా తమ పౌరులకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో ఉంటున్న ఇటలీ దేశస్తులు మరింత జాగరూకతతో, అప్రమత్తతతో వుండాలని సూచించింది. జనసమూహాలకు దూరంగా వుండాలని హెచ్చరించింది.