: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (91) అస్తమయం
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు (91) అస్తమించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 2.45 గంటలకు బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత 2.00 గంటల సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆయనను వెంటనే కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీకి తరలించి ఆక్సిజన్ పెట్టారు. తరువాత పదినిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందం పరిశీలించగా అప్పటికే శ్వాస ఆగిపోయినట్టు గుర్తించి కుటుంబసభ్యులకు తెలిపారు.
తుది క్షణాలలో కుమార్తె నాగసుశీల, మనవడు సుశాంత్ ఆయన పక్కనే ఉన్నారు. అక్కినేని గత కొంతకాలంగా పేగు కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేస్తూ, తను కేన్సర్ వ్యాధిని జయిస్తానని, ఎంతో ఆత్మవిశ్వాసంతో తెలిపిన సంగతి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని తొలగించి, కీమో థెరపీ చికిత్సనందిస్తున్నారు. ఇక అప్పటినుంచి ఆయన చక్రాల కుర్చీలోనే తిరుగుతున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఆయన కుమారుడు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.