: కేబుల్ టీవీ ద్వారా రిలీజ్ అవుతోన్న 'ఇంకెన్నాళ్లు' చిత్రం
ఇటీవల
కాలంలో చిన్న సినిమాలు నిర్మించటం కంటే, వాటిని విడుదల చేయడం భారంగా
మారిందని చిత్ర సీమలో తరచూ వినిపిస్తోన్న ఆరోపణ. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి
సినిమా చిత్రీకరిస్తే రిలీజ్ చేసేందుకు థియేటర్లు దొరకని పరిస్థితి ఉందని
చిన్న దర్శకనిర్మాతలు తరచూ వాపోతున్నారు. ఈ నేపధ్యంలో 'ఇంకెన్నాళ్లు'
సినిమా దర్శకనిర్మాతలు ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో సినిమా ని రిలీజ్
చేయాలని సంకల్పించారు. ఈ సినిమాని ఉగాది పర్వదినాన తెలంగాణ వ్యాప్తంగా
సాయంత్రం 5 గంటలకు కేబుల్ టీవీల్లో ప్రసారం చేయబోతున్నారు.
దీనికి సంబంధించి `ఇంకెన్నాళ్లు` చిత్ర, హీరో.. దర్శకుడైన రఫీ వివరాలు వెల్లడించారు. తన దర్శకత్వంలో రూపొందిన `ఇంకెన్నాళ్లు` సినిమాకి నంది అవార్డు వచ్చినా ప్రదర్శించేందుకు థియేటర్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాను కేబుల్ టీవీ లో ప్రసారం చేసేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ఎంఎస్ఓలను రఫీ ఈ సందర్భంగా అభినందించారు. తన చిత్రానికి చెందిన సర్వ హక్కులు తెలంగాణ ఎంఎస్ఓలకు అందజేస్తున్నట్టు రఫీ ప్రకటించారు.