: శాసనమండలిలో నన్నపనేని తీవ్ర ఆవేదన!
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనమండలిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సభలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని విడదీయాలంటూ డిమాండ్ లు రావడంపై తాను తీవ్ర ఆవేదన చెందుతున్నానన్నారు. అయితే, రాష్ట్రం విడిపోతుందని తాను అనుకోవటంలేదన్నారు. తెలంగాణ, కోస్తాంధ్ర అని ఏనాడు తాము ఆలోచించలేదని, కలిసి ఉండాలనే అనుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కవి, పాటల రచయిత సి.నారాయణ రెడ్డిపై తను ఓ పుస్తకం రాశానని చెప్పారు. ఆ పుస్తకంలో ఆయనపై తను రాసిన మాటలను చదివి వినిపించారు. ఈ సమయంలో కంటతడి పెట్టిన రాజకుమారి.. కలిసుండాలనే తామెప్పుడూ అనుకుంటామన్నారు.
ఇక హైదరాబాద్ గురించి మాట్లాడిన నన్నపనేని.. ప్రజలు కట్టే పన్నులతోనే హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. దేశానికి రెండో రాజధానిగా గుర్తింపు ఉంది కాబట్టే, అనేక పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పారన్నారు. దాంతో, హైదరాబాద్ నగరం మెడికల్ సిటీగానూ అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. అయితే, ప్రజల డబ్బులతోనే పరిశ్రమలు, హైటెక్ సిటీ కట్టారని వివరించారు. రాష్ట్రం విడిపోవడానికి తాము వంద కారణాలు చెబుతాం.. కలిసుండేందుకు మీరు ఒక్క కారణం చూపండని తెలంగాణ వారు ఎప్పుడూ అంటుంటారని ప్రస్తావించిన నన్నపనేని... కలిసుండేందుకు తాను వంద కారణాలు చెబుతానన్నారు.