: అమెరికా టీవీ దిగ్గజాలకు వణుకు పుట్టిస్తున్న.. బుల్లి యాంటెన్నా
ప్రవాస భారతీయుడు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన చేట్ కనోజియా కనిపెట్టిన బుల్లి యాంటెన్నా ఇప్పుడు అమెరికాలోని టీవీ దిగ్గజాలకు వణుకు పుట్టిస్తోంది. ఆ యాంటెనా టీవీ సిగ్నల్స్ ను క్యాచ్ చేసి.. వాటిని అంతర్జాలం (ఇంటర్నెట్) ద్వారా వినియోగదారులకు చేరవేస్తుంది. ఏబీసీ, ఎన్బీసీ, సీబీఎస్ లాంటి టీవీ ప్రసారాల నెట్ వర్క్ లకు ఇప్పుడీ యాంటెన్నా పెనుముప్పుగా మారింది. కనోజియాకు చెందిన కంపెనీ ప్రస్తుతం టీవీ సంస్థలతో అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తోంది.
ఏయీఆర్ యీవో అని పిలిచే యాంటెన్నా ఎలాంటి వైర్లు, కేబుల్ బాక్సులతో పనిలేకుండా ఇంటర్నెట్ ద్వారా సంబంధిత పరికరంపై టీవీ ప్రసారాలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రతి వినియోగదారుడు కేవలం ఒక రిమోట్ యాంటెన్నా, ఒక డివిఆర్ ద్వారా టీవీ ప్రసారాలను పొందవచ్చు. సుప్రీంకోర్టు ఈ నెలలోనే కేసుపై విచారణ చేపడుతుందని న్యూయార్క్ టైమ్స్ లో ప్రచురితమైన వార్తాకథనంలో పేర్కొన్నారు. ఈ కేసు నెగ్గితే మన ‘బుల్లి యాంటెన్నా’ అమెరికాలో హవా కొనసాగించడం ఖాయం.