: ధర్నా స్థలం నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా: కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో పోలీసుల తీరుకు నిరసనగా ఇవాళ (సోమవారం) ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రైల్వే భవన్ సమీపంలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఏఏపీ నిరసనతో ఇవాళ మధ్యాహ్నం వరకు ఢిల్లీలోని నాలుగు మెట్రో స్టేషన్లను కూడా మూసివేశారు. సామాన్యుల పట్ల పోలీసుల తీరు బాగోలేదని, మహిళలకు హస్తినలో రక్షణ లేకుండా పోయిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అంతేకాదు, ఈ ఆందోళనను పది రోజుల పాటు కొనసాగించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ధర్నా వల్ల ప్రభుత్వ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకుంటామని ఢిల్లీ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లను ఆయన దీక్షా శిబిరం వద్దే పరిశీలించారు. ధర్నా స్థలి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆయన ప్రకటించారు. ధర్నా వల్ల ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తితే కేంద్రం, హోంమంత్రి షిండే బాధ్యత వహించాలని ఆయన చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పి తీరుతామని కేజ్రీవాల్ ధర్నా స్థలిలో ప్రకటించారు.