: యన్టీఆర్ విజయవాడ పర్యటనలో రాజకీయం!
జూనియర్ యన్టీఆర్ ఇవాళ్టి బెజవాడ పర్యటన రాజకీయవర్గాల్లో కొత్త సందేహాలకు తావిచ్చింది. పర్యటన ఆద్యంతం జూనియర్ కు తెలుగుదేశం పార్టీ వర్గాలు పూర్తిగా దూరంగా ఉండటం ఇందుకు కారణమైంది. ఉద్ధేశ్య పూర్వకంగానే టీడీపీ నేతలు జూనియర్ కు దూరంగా ఉన్నారని కొందరు యన్టీఆర్ అభిమానులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. కాగా, ఇటీవల కొంతకాలంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో వచ్చిన మార్పులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పొడచూపిన విభేదాలు ఈ సందేహాలకు మరింత ఊతమిస్తున్నాయి.
గతంలో టీడీపీ కీలక నేతగా వ్యవహరించిన కొడాలి నాని, టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించి పార్టీకి గుడ్ బై చెప్పడంతో కృష్ణా జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కొడాలి నాని విమర్శలను బాలయ్య తీవ్రంగా తిప్పికొట్టడం, పార్టీ ఆదేశిస్తే గుడివాడనుంచి పోటీకి రెడీ అంటూ ప్రకటించటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ తెలుగు దేశం కోసం సమష్టిగా శ్రమించిన తెలుగుతమ్ముళ్లు రెండుగా విడిపోయారని అంటున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ కు - కొడాలి నానీకి మధ్య ఉన్న స్నేహం దృష్ట్యా, ప్రస్తుత పరిస్థితిని కొందరు జూనియర్ యన్టీఆర్ కీ- తెలుగుదేశం పార్టీకి మధ్య విభేదాలుగా ఆపాదిస్తున్నారు. మరోవైపు.. ఇది పూర్తిగా ఎన్టీఆర్ ప్రైవేట్ వ్యవహారమని, దీనికి పార్టీతో ఏ మాత్రం సంబంధంలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, యన్టీఆర్ పర్యటనకు విజయవాడలో అద్భుత స్పందన లభించింది.
భారీ సంఖ్యలో అభిమానులు జూనియర్ కు జేజేలు పలికారు. కారులో నుంచే యన్టీఆర్
తన అభిమానులను పలకరిస్తూ ముందుకు సాగాడు. 'మల్ బార్ గోల్డ్' వారి కార్యక్రమంలో
పాల్గొన్న అనంతరం ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్ కు పయనమయ్యారు. ఏమైనా, ఎన్టీఆర్ విజయవాడ పర్యటన రాజకీయవర్గాలలో ఆసక్తి రేకెత్తించింది!