: మూడు ప్రాంతాల్లో ఎవరు బాధపడ్డా మరొకరు తల్లడిల్లాలి: జేపీ


తెలంగాణ గుండెకు గాయమైతే కోస్తా కన్నీరు కారుస్తుంది. రాయలసీమ రక్తమోడితే తెలంగాణ తల్లడిల్లుతుంది. కోస్తా బాధపడితే రాయలసీమ తల్లడిల్లుతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. శాసన సభలో ఆయన మాట్లాడుతూ ఎవరికీ నష్టం కలగని.. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించినప్పుడే విభజనను కోరుకుందామని అన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తితో ఎక్కువ రాయితీలతో ప్రజలు కోరుకుంటే మరో రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కోస్తాకు తీరప్రాంత మినహాయింపులు కావాలని జేపీ డిమాండ్ చేశారు. దుంగరాజపట్నంలో అత్యాధునిక పోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. నోటి మాటలు చెప్పకుండా చట్టాలు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ నగరం తెలుగు ప్రజల అందరిదని, రాజకీయంగా తెలంగాణ ప్రాంతానిదే కానీ.. దానిపై అందరికీ హక్కులు ఉండాలని ఆయన సూచించారు.

గవర్నర్ కు అధికారాలు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్దంగా కాకుండా ఎన్నికల ఎత్తుగడగా విభజన జరుగుతోందని అయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాజ్యవ్యవస్థను మార్పు చేసినంత మాత్రాన బ్రతుకులు మారవని ఆయన సూచించారు. మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించే చదువు నేర్పించాలని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థ పతనమైపోయిందని అన్నారు. ఈ మొత్తం సమస్యకు కారణం అధికార లాలసేనని ఆయన స్పష్టం చేశారు.

బడిపంతులు బదిలీ కావాలంటే సీఎం పైరవీ కావాలి. అధికార వికేంద్రీకరణ జరగాలని ఆయన సూచించారు. రాజధానిని కూడా విభజించాలి. వింటర్ క్యాపిటల్ ఓ చోట, హైకోర్టు ఓ చోట, వాణిజ్య రాజధాని మరో చోట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభలో ఒక్క సీటుకోసం 40 కోట్లు ఖర్చుచేసే సంస్కృతి పోవాలని ఆకాంక్షించారు. రాజకీయం అంటే కాంట్రాక్టులు, గుత్తాధిపత్యం, వనరులు కొల్లగొట్టడం మాత్రం కాదని గుర్తించాలని రాజకీయ నాయకులకు జయప్రకాశ్ నారాయణ సూచించారు.

  • Loading...

More Telugu News