: అమెరికాకు మోడీ మరో తలనొప్పి: టైమ్ మేగజైన్
అగ్రరాజ్యం అమెరికాకు మోడీ అంశం మరో తలనొప్పిగా మారనుందని టైమ్ మేగజైన్ అభివర్ణించింది. ఇప్పటికే భారత దౌత్యవేత్త దేవయాని విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టగా.. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అయిన మోడీ వీసా అంశం ఇరు దేశాల మధ్య మరింత స్పర్థలకు దారితీయవచ్చనేది ఆ కథనం సారాంశం. 2002నాటి గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలతో అమెరికా ఆయన వీసాపై 2005లో నిషేధం విధించింది. అదిప్పటికీ కొనసాగుతోంది. కానీ, ఇంతవరకు ఏ కోర్టూ నాటి అల్లర్లలో మోడీ పాత్ర ఉందని నిర్ధారించలేదు.
మోడీ భారత ప్రధాని అయితే, ఆయనను అమెరికా బ్లాక్ లిస్టులో పెడుతుందా? అని టైమ్ మేగజైన్ లో రచయిత మైకేల్ క్రౌలీ ప్రశ్నించారు. మోడీ విజయం సాధిస్తే.. ఆయనను అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలనే డిమాండ్లు వస్తాయని.. ఈ నేపథ్యంలో ఒబామా జాతి ప్రయోజనాల కోణంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీతో అమెరికా సంబంధాలు ఎంతో కీలకమైనవని.. కనుక ఇకముందూ కలిసి సాగాలని, మోడీ గతాన్ని అమెరికా వదిలేయాలని కాలమ్ లో మైకేల్ క్రౌలీ సూచించారు. ఈ కథనం ఈ నెల 27నాటి సంచికలో ప్రచురితం కానుంది.