: 'వాళ్లు ఏ మతానికీ చెందిన దేవుళ్లు కారు'


సృష్టి లయకారుడు ఈశ్వరుడు ...జగన్మాత దుర్గాదేవి... రామభక్త హనుమంతుడు ... వీరంతా హిందువులచే పూజలందుకునే దైవాలు. అయితే, వీరు ఏ మతానికీ ప్రత్యేకించిన వారు కాదట. వీరు విశ్వంలో అత్యద్భుత శక్తులున్న వారని నాగ్ పూర్ లోని ఆదాయపన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది. 

అసలు విషయంలోకి వెళితే ... నాగ్ పూర్ లోని శివమందిర్ దేవస్థాన్ పాంచ్ కమిటీ సంస్థాన్ చేసిన వ్యయానికి ఆదాయపన్ను శాఖ మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. మత సంబంధమైన కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టిన మొత్తానికి పన్ను కట్టాల్సిందేనని ఆదేశించింది.

దీనిపై శివమందిర్ దేవస్థానం ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. నిబంధనల ప్రకారం ఏ సంస్థ అయినా ఆదాయపన్ను మినహాయింపు పొందాలంటే ప్రత్యేకంగా మతం, కులం పరంగా లబ్ధి కలిగి ఉండరాదు. 

ఆదాయపన్ను శాఖ కమిషనర్ వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ''శివుడు, దుర్గాదేవి, హనుమాన్ దేవుళ్ల కోసం, దేవాలయ నిర్వహణ కోసం చేసిన వ్యయాన్ని మతసంబంధమైనదిగా పరిగణించరాదు. హిందుత్వం అన్నది ఒక మతం కాదు, ఒక వర్గం కాదు. ఎన్నో కులాలు, భిన్నమైన దేవుళ్ల సమూహం. హిందుత్వాన్ని ఎంచుకున్నప్పటికీ ఒక వ్యక్తికి దేవుడిని పూజించడం తప్పని సరేం కాదు. కమ్యూనిటీ అంటే కొంత మంది ప్రజలు ఒకే ప్రాంతంలో నివసిస్తూ కొన్ని చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండేవారు. ఇది క్రైస్తవులు, ముస్లింలకు వర్తిస్తుంది. సాంకేతికంగా హిందుత్వం అనేది మతం, కులం కాదు'' అని ఆదాయపన్ను విభాగానికి ట్రిబ్యునల్ హితబోధన చేసింది. అదండీ విషయం! 

  • Loading...

More Telugu News