: జరిగిందేదో జరిగింది.. తెలుగు ప్రజల మధ్య సఖ్యతకు ప్రయత్నిద్దాం: జేపీ
గతాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరని, జరిగిందేదో జరిగిందని ఇకనైనా తెలుగు ప్రజల సంక్షేమానికి, సఖ్యతకు కృషి చేద్దామని లోక్ సత్తా జాతీయ అధినేత జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ లోక్ సభలో విభజన బిల్లుపై తన అభిప్రాయం చెప్పే సందర్భంలో ఎవరూ ఓడిపోని విధంగా పరిష్కారం చూపిస్తానని అన్నారు. తెలుగు ప్రజల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొనేందుకు రాజకీయ పార్టీల నేతలంతా కలిసి ప్రయత్నిద్దామని జేపీ సూచించారు.
విభజన వల్ల సాధించేది ఏమీ ఉండదని, జాతులన్నీ కలిసే ఉన్నాయని, తెలుగు జాతి కలిసి ఉండడం సాధ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి కొనసాగిన ఆందోళనలు, నిరసనలు రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయని అయన అన్నారు. ఇప్పటికైనా సంక్షోభానికి అంతం పలుకుదామని జేపీ పిలుపునిచ్చారు.