: సుచిత్ర నటనే ఓ కొలమానం!
బెంగాలీ సినీ రంగాన్ని 1950-70 మధ్య కాలంలో తన అందచందాలతో, అభినయ కౌశలంతో ఏలిన మహారాణి సుచిత్రా సేన్. హిమాలయ శిఖరమంత అభినయంతో అభిమానులను రంజింపజేసిన సుచిత్రా.. తన కళ్లతోనే వేలభావాలు పలికించగల తార. నటన అంటే ఇలా చేయాలి.. ఇలాగే నటించాలన్న కొలమానాలు లేని కాలంలో, తన ప్రత్యేకతను చాటుకుని బెంగాలీ, హిందీ చిత్రాల్లో అగ్రతారగా వెలుగొందింది.
1947లో దిబనాథ్ సేన్ అనే వ్యాపారవేత్తను వివాహమాడిన సుచిత్రా.. 1952లో బెంగాలీ చిత్రం 'శేష్ కొతాయ్'తో సినీ నట జీవితాన్ని ప్రారంభించింది. విచిత్రమేమంటే, అది విడుదల కాలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. ఆ వెంటనే వచ్చిన మరిన్ని అవకాశాలతో పలు చిత్రాల్లో నటించారు. అప్పటివరకు సాదాసీదాగా సాగిపోతున్న సుచిత్ర నటజీవితాన్ని, 1955లో ఆమె హిందీలో నటించిన తొలి చిత్రం 'దేవదాస్' ఓ మలుపు తిప్పింది. ఈ సినిమాలో ఆమె కనబరిచిన అద్భుత నటన సినీ విమర్శకుల చేత సైతం జై కొట్టించింది. ఈ విజయంతో వెంట వెంటనే పలు బెంగాలీ చిత్రాల్లో నటించిన సుచిత్ర అక్కడి ప్రేక్షకుల ఆరాధ్య నటిగా మారిపోయింది.
అనంతరం ఇందిరాగాంధీ జీవిత కథను పోలిన 'అంధీ' అనే హిందీ చిత్రంలోనూ నటించి మరింత ఖ్యాతి గడించారు. 'దేవదాసు' చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు అందుకున్న సుచిత్ర, అనంతర కాలంలో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా (మాస్కో ఫిల్మ్ ఫెస్టెవల్-'సప్తపది' చిత్రానికి) గా పేరు సంపాదించారు. దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు సినీ పరిశ్రమను ఏలిన సుచిత్ర.. 1970లో నటనకు స్వస్తి చెప్పారు.
అనంతరం వయసు పైబడటంతో అభిమానులకు కనిపించకుండా ఒంటరిగా జీవిస్తూ వచ్చారు. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గానూ 1972లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అటు కోల్ కతా ప్రభుత్వం 'వంగ విభేషణ్' అవార్డుతో సన్మానించింది. ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ ఆమె కుమార్తె. వర్థమాన నటీమణులు రైమాసేన్, రియా సేన్ సుచిత్రకు మనుమరాళ్లు. ఆమె వారసత్వాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు.