: 60 ఏళ్ల పోరాటం కాదు.. వేల ఏళ్ల పోరాటం: శైలజానాథ్
తెలంగాణ ప్రాంత పోరాటం 60 ఏళ్ల పోరాటమని అందరూ చెబుతున్నారని, కానీ తెలుగు వారి పోరాటం వేల ఏళ్ల పోరాటమని మంత్రి శైలజానాథ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వారు పిలిస్తేనే కర్నూలు వదులుకుని, మనరాష్ట్రం అని హైదరాబాద్ వచ్చామని, తమకు రాజధాని లేక, నిధులు లేక కాదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. హైదరాబాద్ రాజధాని అయితేనే విశాలాంధ్రకు ఒప్పుకుంటామంటే సువిశాల ప్రయోజనాల దృష్ట్యా తమ పెద్దలు ఒప్పుకున్నారని ఆయన అన్నారు.
తెలుగు ప్రజల మధ్య విభేదాల వల్లే ఇతర రాష్ట్రాలకు చాలా ప్రాంతాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. మంత్రి పదవి రాలేదని ఒక నేత తెలంగాణ పోరాటం మొదలు పెట్టాడన్న విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. మిలటరీ అవసరాల కోసమే నిజాం కోస్తాంధ్రను వదులుకున్నారనేది చారిత్రక వాస్తవమని ఆయన గుర్తు చేశారు. చారిత్రక వాస్తవాలు గుర్తిస్తే తెలంగాణ అంటే తెలుగు గాణం అన్న విషయాన్ని గుర్తిస్తారని ఆయన అన్నారు. ఫజుల్ అలీ కమిషన్ సూచనల్ని అప్పటి నేతలే ఒప్పుకోలేదని ఆయన గుర్తుచేశారు.