: విభజన ఆషామాషీ వ్యవహారం కాదు.. ఆత్మపరిశీలన చేసుకోవాలి: జూలకంటి


రాష్ట్ర విభజన వ్యవహారం ఆషామాషీది కాదని.. దీనిపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి సూచించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయకపోతే ఆర్థిక పరిస్థితి తారుమారై అసమానతలు తలెత్తుతాయని గతంలో కమ్యూనిస్టు నేతలు గుర్తు చేశారని అన్నారు. తమ పార్టీ జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయం కారణంగానే తాము సమైక్యానికి మద్దతు పలుకుతున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు తలెత్తిన పరిస్థితికి కారణం రాజకీయ పార్టీల తీరుతెన్నులేనని ఆయన ఆరోపించారు.

అధికారంలోకి రావడానికి ఓట్ల పథకాలు, అధికారంలోకి వచ్చాక సంపాదనకోసం కోట్ల పథకాలు అనే అందరూ ఆలోచిస్తున్నారు తప్ప, ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందడం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చి 400 మంది పోయారు. 1972లో అన్యాయం జరుగుతోందంటూ జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పుడైనా గతంలో జరిగిన ఒప్పందాలు అమలు జరిగి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఉద్యమాలు తలెత్తిన ప్రతిసారీ ఏదో ఒకటి చెప్పి వాయిదా వేయడం తప్పితే, పరిష్కారం చేయలేదని ఆయన ఆరోపించారు. ఇకనైనా అలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బోర్డులు ఏర్పాటు చేస్తారు, వాటికి నిధులు, విధులు ఉండవు.. ఇలా అయితే ఉద్యమాలు రావా? అని ప్రశ్నించారు. ఎంత సేపూ ఓట్లు, సీట్ల గోల తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోని అభివృద్ధికి నోచుకోని జిల్లాలు చాలా ఉన్నాయని ఆయన సూచించారు. గతంలో విడిపోదాం, రాజధానులు కట్టుకుందాం, అభివృద్ధి చెందుదాం అనుకుని విడిపోయిన రాష్ట్రాల పరిస్థితి చూస్తే వాస్తవాలు భయంకరంగా ఉన్నాయని, గతంలో విడిపోయిన రాష్ట్రాలను ఉదాహరణలుగా సూచించారు.

  • Loading...

More Telugu News