: మరోసారి సమ్మెకు దిగిన డాక్యుమెంట్ రైటర్లు
డాక్యుమెంట్ రైటర్లు సమ్మెకు దిగడంతో గురువారం రాష్ట్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన 432 కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పనులను 'మీ సేవ' కేంద్రాలకు ఇవ్వడంతో వారు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లున్నారు. వీరు అధికారులు, ప్రజల మధ్య ఏజెంట్స్ మాదిరిగా పనిచేస్తున్నారు. అయితే, వీరు డాక్యుమెంటేషన్ చార్జీల పేరుతో లంచాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం ఈసీల కోసం దరఖాస్తులు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ధృవీకృత కాపీలను మీ సేవ కేంద్రాలకు చెందిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రతిపాదించింది. ఈ లావాదేవీలను పారదర్శకంగా పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ-సేవా కేంద్రాల వల్ల రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోతారని వారు ప్రభుత్వానికి ఇంతకు ముందే విన్నవించుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లు డిసెంబర్ నెలలో మూడు రోజుల పాటు సమ్మె చేసిన విషయం విదితమే.