: అతిగా మద్యం సేవిస్తే జ్ఞాపకశక్తికి దెబ్బే!
అతిగా మద్యం సేవించే మధ్యవయసు పురుషుల్లో జ్ఞాపకశక్తి క్షీణత ఆరేళ్ళ ముందే మొదలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యపానం, జ్ఞాపకశక్తి క్షీణతకు గల సంబంధంపై పరిశోధకులు తాజాగా ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయయానికి వీరు నడివయసు వారిని ఎంపిక చేసుకున్నారు. ఇందులో భాగంగా 5054 మంది పురుషులు, 2099 మంది మహిళల మద్యపాన అలవాట్లను పదేళ్ల పాటు అధ్యయనం చేశారు. రోజుకు రెండున్నర పెగ్గులు కన్నా ఎక్కువ మద్యం సేవించే వారిలో జ్ఞాపకశక్తి క్షీణిస్తున్నట్టు గుర్తించారు. మద్యం అలవాటు లేనివారు, మద్యం మానేసిన వారు, చాలా తక్కువ మోతాదులో మద్యం తీసుకునే వారితో పోలిస్తే వీరిలో మతిమరుపు లక్షణాలు ఆరేళ్ల ముందుగానే కనిపించినట్టు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సెవరైన్ సేబియా చెప్పారు. కాబట్టి మద్యం ప్రియులు దీన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడితే మంచిదేగా!