: 1400 కిలోల వెన్నంటిన అమ్మవారి ప్రతిమ!


అమరనాథ్ లో మంచుతో ఏర్పడిన హిమలింగాన్ని చూశాము, కానీ.. వెన్నతో రూపొందించిన అమ్మవారి ప్రతిమను ఎక్కడైనా చూశారా? అవును, ఒకటి, రెండు కాదు.. ఏకంగా 1400 కిలోల వెన్నంటిన అమ్మవారిని చూడాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్ కి వెళ్ళాల్సిందే. ఈ అపురూప భాగ్యం హిమాచల్ ప్రదేశ్ లోని బ్రజేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించే భక్తులకు కలుగుతోంది. వెన్నతో తయారుచేసిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బ్రజేశ్వరిదేవి ఆలయానికి పోటెత్తుతున్నారు. ఈ వెన్న ప్రతిమ భక్తుల సందర్శనార్థం ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు.

పురాణాల ప్రకారం రాక్షసులతో యుద్ధం చేస్తుండగా అమ్మవారు గాయపడ్డారు. మకర సంక్రాంతి రోజున దేవతలు అమ్మవారికి వెన్న పూసి.. ఆ గాయాలను నయం చేశారు. అందుకే, ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి వెన్న సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. అలా భక్తులు సమర్పించిన వెన్నతోనే ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు ఆలయ అధికారి పాశ్వాన్ పాటియాల్ తెలిపారు. ఈ వెన్నను 108 సార్లు నీటితో శుద్ధి చేసి విగ్రహాన్ని తయారుచేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20న ప్రతిమ నుంచి తీసిన వెన్నను భక్తులకు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈ వెన్న చర్మ వ్యాధులను, కీళ్ల నొప్పులను నయం చేస్తుందని అక్కడి భక్తుల విశ్వాసం.

  • Loading...

More Telugu News