: ప్రభుత్వం ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉంది: సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై శాసనసభలో చర్చ కోసం ప్రభుత్వం సభ్యులకు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉందని సీమాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విధంగా అసంబద్ద సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించడం సభాహక్కుల ఉల్లంఘనేనని వారు ఆక్షేపించారు. తాము అడిగిన సమాచారానికి, ప్రభుత్వం ఇచ్చిన వివరాలకు పొంతన లేదని అన్నారు. ప్రధానమైన ఆస్తులు, అప్పుల విషయంలో రాష్ట్ర ప్రజలను చీకట్లో ఉంచడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకోవడం శోచనీయమని పేర్కొన్నారు. 55 ఏళ్లకు పైగా హైదరాబాద్ రాజధానిగా ఉంది కాబట్టి, ఇక్కడి ప్రభుత్వ ఆదాయాలపై ప్రత్యేక నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం లేదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తన తప్పిదాన్ని ఒప్పుకోవడమేనని మండిపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News