: సాదాసీదాగా.. జయంతిని జరుపుకున్న మాయావతి
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సందడి షురూ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)పై పడినట్టే కనిపిస్తోంది. అవును మరి, అందుకే.. బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన జయంతి సాదాసీదాగా జరుపుకున్నారు. ముజఫర్ నగర్ ఘర్షణలకు నిరసనగా జయంతిని జరుపుకోవడం లేదని ఆమె ప్రకటించేశారు. మాయావతి తన 58వ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నా.. తన బలాన్ని, బలగాన్ని ప్రత్యర్థి ములాయం సింగ్ కు చూపించారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ర్యాలీ నిర్వహించి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వందలాది బీఎస్పీ నేతలు, వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ప్రతి సంవత్సరం పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడం మాయావతికి అలవాటు. మేడమ్ మాయా జయంతి అంటే.. మరి బీఎస్పీ కార్యకర్తలకు పండగే. లక్నో నగరాన్ని బీఎస్పీ తోరణాలతో, బేనర్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసేందుకు వారు పోటీపడేవారు. అలాంటిది, ఈసారి ఎలాంటి హడావుడి లేదు. ఎవరికి వారు గుట్టుచప్పుడు కాకుండా.. ఈ ర్యాలీ కోసం జన సమీకరణ పనిలో పడ్డారు. భారీగా హాజరైన జన సందోహాన్ని చూసిన మాయా ఉత్సాహంతో.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కోరుకొనే ప్రత్యామ్నాయాన్ని తమ పార్టీ ఇవ్వనుందని ప్రకటించేశారు.