: పిల్లలతో వ్యాపారం చేసిన మహిళా డాక్టర్ కు మరణశిక్ష
వైద్యులను దైవానికి మారు రూపంగా చెబుతారు. విలువైన వృత్తిలో ఉన్న వారికి చేతినిండా ఆదాయం కూడా వస్తుంది. కానీ, చైనాలో ఒక మహిళా డాక్టర్ కు డబ్బుపై మరింత వెర్రి పుట్టింది. పిల్లలతో వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కింది. ఏడుగురు బేబీలను విక్రయించినట్లు నేరం నిరూపితం కావడంతో స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.
షాంగ్జి ప్రావిన్స్ లోని ఫ్యూపింగ్ కౌంటీలో ఒక మేటర్నల్, చైల్డ్ కేర్ ఆస్పత్రిలో ఝాంగ్ షుక్సియా(55) వైద్యురాలిగా పనిచేస్తోంది. అనారోగ్యంతో జన్మించిన బేబీలను తనకివ్వాలని, వారి పోషణ తాను చూస్తానంటూ వారి తల్లిదండ్రులను ఒప్పించేదని వీనాన్ కోర్టు తన తీర్పులో పేర్కొంది. బేబీలు తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వారి తల్లిదండ్రులను భయపెట్టినట్లు కోర్టు నిర్ధారించింది.
వృత్తి, సామాజిక నైతిక విలువలను డాక్టర్ అతిక్రమించారని కోర్టు పేర్కొంది. ఆమెకు సస్పెండెడ్ డెత్ సెంటెన్స్ ( రెండు సంవత్సరాల పాటు నిలిపి ఉంచేలా మరణశిక్ష) విధించింది. సాధారణంగా ఇలాంటి శిక్షలను చైనాలో జీవితఖైదుగా మారుస్తుంటారు. తమ బిడ్డను అక్రమ రవాణాదారులకు విక్రయించారనే అనుమానంతో ఒక బేబీ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. డాక్టర్ నేరం వెలుగుచూసింది. ఆమె మొత్తం ఏడుగురు బేబీలను విక్రయించగా.. అందులో ఒక బేబీ తర్వాత కన్నుమూసింది.