: హరీష్ రావుతో సీఎం మాటల ఫైట్!
ఒకరు గౌరవనీయ ఎమ్మెల్యే.. మరొకరు అంతకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి! వారు తామున్నది ప్రజల కోసం శాసనాలు చేసే అసెంబ్లీలో అన్న సంగతి మరిచారు. సామాన్యుల మల్లే మాటకుమాట విసురుకున్నారు, సభలో వినోదం పంచారు. ఈ సంఘటన ఈరోజు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కిరణ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య చోటు చేసుకుంది.
తొలుత హరీష్ తెలంగాణ అంశంపై మాట్లాడుతుండగా సీఎం వెంటనే స్పందించారు. ముందు హరీష్ భాషను మార్చుకోవాలని సూచించారు. తెలంగాణ పట్ల వివక్ష చూపితే కాలర్ పట్టుకుని నిలదీస్తామని హరీష్ అనడాన్ని కిరణ్ తప్పుబట్టారు. 'ఆయనేమన్నా వీధి రౌడీనా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరో చెబితే తెలంగాణకు నిధులు విడుదల చేయడంలేదని, అక్కడ అవసరం కాబట్టే నిధులు ఖర్చుచేస్తున్నామని సీఎం అన్నారు. ఇలా మాట్లాడితే ఒక్కరూపాయి కూడా ఇవ్వబోమని కిరణ్ తెగేసి చెప్పారు.