: ప్రధాని పదవిపై ఆశ లేదు: చంద్రబాబు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇవాళ (మంగళవారం) స్వగ్రామమైన నారావారి పల్లెకు చేరుకొన్నారు. ఉదయం ఆయన ఇంటింటికి వెళ్లి స్నేహితులను, ఆత్మీయులను పలకరించారు. అనంతరం ఆయన తల్లిదండ్రుల సమాధులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు వెంట భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి ఉన్నారు.
ఈ నెల 27, 28 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ఉంటుందని ఆయన చెప్పారు. విభజన పేరు చెప్పి అన్నదమ్ములుగా కలిసున్న తెలుగువారి మధ్య చిచ్చుపెడుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. చిరంజీవి సొంత పార్టీ పెట్టి దానిని నడపలేకపోయారని ఆయన అన్నారు. అలాంటిది.. కిరణ్, జగన్ లు సొంత పార్టీ పెట్టి, ప్రజలకు చేసేది ఏమీ లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రధాని పదవిపై తనకు ఆశ లేదని ఆయన తెలిపారు. ఇంతకు ముందే ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తాను అందుకు అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు.