: ఆమ్ ఆద్మీ మంత్రిపై ఆరోపణల వెల్లువ
అవినీతిపై బాణం ఎక్కుపెట్టి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏఏపీ ప్రభుత్వంలోని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి. న్యాయవాది నుంచి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన సోమనాథ్... పోయిన ఏడాది ఓ కేసు వాదించినప్పుడు సాక్షులకు డబ్బిచ్చి, సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు "మీ ప్రవర్తన అభ్యంతరకరం. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు" అని జడ్జి వ్యాఖ్యానించిన విషయాలను ప్రతిపక్షాలు తెరమీదకు తెస్తున్నాయి.
ఈ విషయంపై కేజ్రీవాల్ వెంటనే స్పందించాలని కాంగ్రెస్ నేత షకీల్ అహ్మద్ డిమాండ్ చేశారు. బీజేపీ నేత హర్షవర్ధన్ కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. గతంలో సోమ్ నాథ్ తన సెక్రెటరీతో అసభ్యంగా ప్రవర్తించారని... ఇప్పుడు తాజాగా ఓ కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్టు ఆధారాలు లభించాయని విమర్శించారు. ఏదేమైనప్పటికీ అధికారంలోకి వచ్చి రోజులు కూడా గడవకముందే ఏఏపీపై ఇలాంటి ఆరోపణలు రావడం కేజ్రీవాల్ కు ఇబ్బందే.