: భారీగా వెలసిన కొత్త పార్టీ ఫ్లెక్సీలు.. కిరణ్ పార్టీవేనా?
విజయవాడలో వెలసిన కొత్త ఫ్లెక్సీలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇవి రానున్న కొత్త పార్టీవేనంటూ అందరూ అనుకుంటున్నారు. బెజవాడ నగరంలో ఎక్కడపడితే అక్కడ వెలసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫ్లెక్సీలపై పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి, బూర్గుల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ఫ్లెక్సీపై నిలువుగా కాషాయం రంగు, అడ్డంగా ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ రంగులు ఉన్నాయి.
ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ నెల 23వ తేదీ లోపల ఇవ్వాలంటూ... ఫ్లెక్సీలోని రంగులతో 15 లక్షల టీషర్టులకు ఆర్డర్లు కూడా ఇచ్చారని సమాచారం. 'సమైక్యం మా విధానం, జై సమైక్యాధ్రం మా నినాదం' అని ఫ్లెక్సీలపై రాసుంది. ఇవే మాటలను ఇటీవలే సీఎం కిరణ్ అసెంబ్లీలో కూడా చెప్పారు. దీంతో, ఈ ఫ్లెక్సీలన్నీ ముఖ్యమంత్రి కిరణ్ పెడుతున్న పార్టీకి సంబంధించినవే అని బెజవాడ వాసులు భావిస్తున్నారు. కొత్త పార్టీకి సంబంధించి ప్రచార రథాలు కూడా తయారవుతున్నట్టు సమాచారం.