: 'ఎస్సెమ్మెస్'లు ఇలా కూడా ఉపయోగపడుతున్నాయి!
చీటికీ మాటికీ వచ్చే రకరకాల ఎస్సెమ్మెస్ లను చూసి, 'ఈ ఎస్సెమ్మెస్ ల గోలేంట్రా బాబూ!' అంటూ మనం అప్పుడప్పుడు చికాకు పడుతుంటాం. అయితే, సొల్లు కబుర్లకు వీటిని ఉపయోగించకుండా, మంచి కోసం వాడుకుంటే కనుక ఈ సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్లు) మనకు ఎంతో మేలు చేస్తాయని తేలింది.
అమెరికాలో గర్భిణీలకు వీటి ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. సమయానికి వ్యాక్సిన్లు వేసుకుని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఈ ఎస్సెమ్మెస్ లు ఎంతగానో తోడ్పడుతున్నాయట. ఈ విషయాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.
బిడ్డ కడుపులో వుండగా తల్లి వేయించుకోవలసిన వ్యాక్సిన్ల విషయంలో, వారానికి మూడు సార్లు అప్రమత్తం చేస్తూ ఎస్సెమ్మెస్ లు ఇవ్వడం వల్ల, తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారని అధ్యయనం పేర్కొంది. ఈ సంక్షిప్త సందేశాలు పంపడం వల్ల వ్యాక్సిన్లు వేయించుకునే తల్లుల సమాఖ్య 30 శాతం పెరిగిందట. పైగా, ఈ ఎస్సెమ్మెస్ లకు ఖర్చు కూడా తక్కువ కాబట్టి, ఇలాంటి విషయాల్లో వీటిపైనే ఆధారపడడం మంచిదని అధ్యయనకారులు సెలవిస్తున్నారు.