: యాదగిరిగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవం
యాదగిరిగుట్ట నృసింహస్వామి సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ (సోమవారం) ఉదయం దివ్యప్రబంధ పఠనం, మధ్యాహ్నం స్వామి వారికి వటపత్రుని అలంకరణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పంచ నారసింహుని రూపంలో స్వామి విరాజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, రుత్వికుల ప్రబంధ పఠనం, భక్తుల జయజయ ధ్వానాల నడుమ స్వామి వారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి గుట్టలో గోదావరి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు.