: తాడేపల్లి నుంచి ప్రపంచ స్థాయికి... అంజిరెడ్డి ప్రస్థానం!


ప్రపంచస్థాయి వ్యాపారవేత్తగా ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేసిన అంజిరెడ్డి (73).. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో1940లో జన్మించారు.  అంజిరెడ్డిది వ్యవసాయదారుల కుటుంబం. గ్రాడ్యుయేషన్ వరకు గుంటూరు జిల్లాలోనే విద్యాభ్యాసం చేసిన అంజిరెడ్డి.. బోంబే యూనివర్శిటీ నుంచి కెమికల్ టెక్నాలజీలో డిగ్రీ అందుకున్నారు.

అనంతరం  పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరి నుంచి పీహెచ్ డీ అందుకున్న అంజిరెడ్డి 1984లో అంతర్జాతీయ ప్రమాణాలతో డా.రెడ్డీస్ ల్యాబ్స్ స్థాపించారు. ఓ మోస్తరు పెట్టుబడులతో సంస్థను ఏర్పాటు చేసి అనతికాలంలోనే దాన్ని దిగ్గజ సంస్థలకు దీటుగా ముందుకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో ఫార్మా రంగం వైపు ఔత్సాహికులు చూపు మరల్చారంటే అది రెడ్డీస్ ల్యాబ్స్ ఏర్పాటైన తర్వాతే!

దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు, అంజిరెడ్డి వ్యాపార దక్షత ఎలాంటిదో. రెడ్డీస్ ల్యాబ్స్ స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించిన అంజిరెడ్డి ఔషధ రంగంలో తిరుగులేని స్థానానికి ఎదిగే క్రమంలో ఎక్కడా రాజీపడలేదు. ఉత్పత్తుల్లో నాణ్యతకే ప్రథమ ప్రాధాన్యత అని నమ్మిన ఆయన సిద్ధాంతం త్వరితగతిన సత్ఫలితాలను ఇచ్చింది. ప్రస్తుతం భారత్ లో ఇది రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీ. 

పాతిక లక్షల పెట్టుబడితో వ్యాపార సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్న అంజిరెడ్డి మానస పుత్రిక రెడ్డీస్ ల్యాబ్స్.. 2006 నాటికి రూ. 2427 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ సంపన్నులు జాబితాలో అంజిరెడ్డికి 64వ స్థానం దక్కింది. తనకున్న దాంట్లో పేదలకు సేవ చేయాలన్న తపనతో రెడ్డీస్ ఫౌండేషన్ ను కూడా స్థాపించి తన సామాజిక చైతన్యాన్ని చాటుకున్నారు. అంజిరెడ్డి ప్రస్థానాన్ని భారత్ ప్రభుత్వం పద్మభూషణ్ తో మరింత మెరుగు పెట్టింది. 

  • Loading...

More Telugu News