: గ్రీకువీరుడిని కుట్రపూరితంగా చంపేశారా...?
గ్రీకువీరుడుగా, ప్రపంచ విజేతగా పేరొందిన అలెగ్జాండర్ ది గ్రేట్ మరణానికి కారణం ఏమై ఉంటుంది... ఏమో ఆయన అవసాన దశలో తీవ్ర అనారోగ్యం బారిన పడి మరణించాడని చరిత్ర కారులు చెబుతారు. ఆయన మరణించి కూడా దాదాపు రెండువేల ఏళ్లు గడిచింది. అయినా ఆయన మరణం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉండేది. దీన్ని ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఛేదించారు. ఒక విషపూరితమైన మొక్కనుండి తయారుచేసిన మధువు కారణంగానే ఆయన మరణించాడని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.
ఒటాగో విశ్వవిద్యాలయంలోని పాయిజన్స్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక మొక్కనుండి తయారుచేసిన విషపూరితమైన మద్యం సేవించడం వల్లే ఆయన చనిపోయాడని చెబుతున్నారు. చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించిన విజేత అలెగ్జాండర్ కేవలం 32 ఏళ్ల వయసులోనే అంతుచిక్కని కారణంతో మరణించడంపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఆయన సహజసిద్ధంగా మరణించారని చెబుతుండగా, మరికొందరు ఆయనను విందులో గుట్టుచప్పుడు కాకుండా మట్టుబెట్టి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఒటాగో విశ్వవిద్యాలయానికి చెందిన లియో స్కెప్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయంపై దృష్టి సారించింది. వెరాట్రమ్ ఆల్బమ్ అనే మొక్క కారణంగా అలెగ్జాండర్ మరణించి ఉంటాడని స్కెప్ చెబుతున్నారు. తెల్లటి పూలను కలిగివుండే ఈ మొక్కను పులియబెట్టి విషతుల్యమైన మద్యాన్ని తయారుచేయవచ్చని స్కెప్ చెబుతున్నారు.
గ్రీకులకు ఈ మొక్క బాగా పరిచయమేనని, వాంతులు కలగజేయడానికి దీన్ని వారు ఉపయోగించేవారని తెలిపారు. అలెగ్జాండర్ మరణించడానికి పన్నెండురోజుల ముందు తీవ్ర నరకయాతన అనుభవించాడని, కనీసం నడిచే, మాట్లాడే పరిస్థితిలో కూడా లేకుండా ఉన్నాడని, వేరే విషపదార్ధాల ప్రయోగమే అయితే అన్ని రోజులపాటు అలెగ్జాండర్ జీవించి ఉండేవాడు కాదని, వెరాట్రమ్ ఆల్బమ్ మొక్కనుండి తయారుచేసిన మద్యమే ఆయన ప్రాణాలను హరించి ఉంటుందని స్కెప్ చెబుతున్నారు. విందు సమయంలో తప్పతాగిన అలెగ్జాండర్ వెరాట్రమ్ మద్యాన్ని కూడా సేవించి ఉంటారని, అయితే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయనపై ఇలా విషప్రయోగం చేశారా? అనే విషయం మాత్రం అంతుచిక్కకుండా ఉందని స్కెప్ చెబుతున్నారు. మొత్తానికి ప్రపంచ విజేతే అయినా... కేవలం మద్యానికి దాసుడు కావడం కారణంగా ప్రాణాలను మధువుకు బలి ఇచ్చుకున్నాడు కదా?