: ఈ పట్టుచీర సూపర్
పట్టుచీర అంటే అలాంటిలాంటి పట్టుచీర కాదు... అచ్చంగా ధర్మవరం చేనేత పట్టుచీర. చక్కటి రంగులో చూడడానికి రెండు కళ్లూ చాలవు అన్నట్టుగా అందంగా, అద్భుతంగా నేసిన చీర. అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత కళాకారుడు మోహన్ తయారుచేసిన పట్టుచీర నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే, ఆ పట్టుచీర వివాహ వేళ తలంబ్రాల సమయంలో పెళ్లికుమార్తె కోసం ప్రత్యేకంగా తయారుచేయబడింది. దీనికి కల్యాణకాంతి అని పేరు కూడా పెట్టారు.
ఈ చీరపై పదహారు తులాల ముత్యాలు, పదహారు రత్నాలను కూర్చి దానిపై పల్లకీలో వధువును మోసుకెళ్లే దృశ్యాన్ని మోహన్ ఆవిష్కరించారు. అలాగే పెళ్లికుమార్తెను ఆశీర్వదిస్తున్నట్టుగా శ్రీరస్తు-శుభమస్తు అనే అక్షరాలను కూడా చీరలో పొందుపరిచారు. ఓస్ ఇంతేనా అనుకోకండి... ఈ చీర కలనేతలో మొత్తం యాభై రకాల గులాబీల సుగంధాన్ని ఒడిసిపట్టి వాటి పరిమళాన్ని చీరలో చుట్టిపెట్టారు. చక్కగా ముద్దబంతి నెక్లెస్, మొగలిపూల తోరణాలతో ముస్తాబైన ఈ చీరను వేదపండితుల సలహాలు, సంప్రదింపులతో తయారుచేశామని, దీన్ని ఇంత చక్కగా రూపొందించడానికి ముఫ్ఫైరోజుల సమయంతోబాటు ముప్ఫైవేల రూపాయలను వెచ్చించామని మోహన్ చెబుతున్నారు. మొత్తానికి అద్భుతమైన చీర మాత్రం రూపుదిద్దుకుంది.