: లేడీస్‌ ‘ఉఫ్‌’ మంటూ దూసుకెళుతున్నారట!!


గుప్పు గుప్పుమంటూ పొగతాగే విషయంలో ఇప్పటి వరకూ పొగరాయుళ్లనే మనం ఎక్కువగా నిందించేవాళ్లం. కానీ ఇప్పుడు ఎక్కువగా పొగతాగేది మగవారుకాదట... మగువలేనట. అందుకే, ఇకపై పొగరాయుళ్లు అన్నట్టుగానే పొగరాణులు అనుకోవాల్సి ఉందేమో... మనదేశంలో అన్ని రంగాల్లోను మగువలు మగవారితో పోటీ పడుతూ ముందంజ వేస్తూ వస్తున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ పొగతాగే విషయంలో కూడా మగువలు మగవారితో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోతున్నారట. గత ముఫ్ఫై ఏళ్ల కాలంలో పొగతాగే మగువల శాతం 0.2 శాతం పెరగగా, అదే సమయంలో పొగతాగే పురుషుల శాతం మాత్రం గణనీయంగా తగ్గిందట.

సీటెల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఇవల్యూషన్‌ అనే సంస్థ పొగతాగే అలవాటు, సిగరెట్ల వినియోగం అనే పేరుతో 187 దేశాల్లో ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన విషయాలేమంటే... మన దేశంలో ముఫ్పై ఏళ్లక్రితం పొగతాగే మహిళల సంఖ్య 53 లక్షలుగా ఉండగా, తాజాగా వీరి సంఖ్య 1.21 కోట్లకు చేరుకుందట. అలాగే పొగరాయుళ్లు సగటున రోజుకు 8.2 సిగరెట్లను ఊదేస్తున్నారట. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా పొగతాగే వారి సంఖ్య 96.7 కోట్లు కాగా, మనదేశంలో పొగతాగేవారి సంఖ్య 11 కోట్లట. అయితే గుడ్డిలో మెల్లలాగా కాస్త ఆనందించాల్సి విషయం ఏమంటే... మన దేశంలో ముఫ్ఫై ఏళ్ల క్రితం మొత్తం జనాభాలో 19 శాతం పొగతాగేవారుండగా, ఇప్పుడు అది 13 శాతానికి తగ్గిందట.

ఈ సర్వే ఫలితాలను గురించి హృదయ్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్‌ మోనికా అరోరా విశ్లేషిస్తూ, పొగాకు వ్యాప్తి ప్రస్తుతం భారతదేశంలో వేగంగా ఉందని, బాలీవుడ్‌ సినిమాలు, ప్రచార చిత్రాలు కూడా పొగతాగడాన్ని ఒక హోదాగా చూపుతుండడంతో టీనేజ్‌ యువతులు కూడా ఎక్కువగా పొగతాగడం పట్ల ఆకర్షితులు అవుతున్నారని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News