: ఆ బాలుడి సాహసం అద్భుతం
సాహసం చేయడానికి వయసుతో పనేముంది? అలాగే వేలమంది ప్రాణాలు కాపాడడానికి కూడా వయసుతో పనిలేదు. అందుకే పధ్నాలుగేళ్ల వయసే అయినా ఒక మానవ బాంబును అడ్డుకుని ఆ పెనుగులాటలో తన ప్రాణాలు కూడా కోల్పోయాడు హసస్. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో జనవరి ఆరున ఒక పాఠశాలలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని ఐత్జాజ్ హసన్ అనే పధ్నాలుగేళ్ల విద్యార్ధి గట్టిగా అడ్డుకున్నాడు. దీంతో ఆ మానవబాంబు పేలిపోవడంతో అతనితోబాటు అతన్ని పట్టుకున్న హసన్ కూడా చనిపోయాడు. ఆ సమయంలో పాఠశాలలో సుమారు రెండు వేలమంది విద్యార్ధులు ఉన్నారు.
తన తోటి విద్యార్ధుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో తన ప్రాణాలను కోల్పోయిన హసన్‌కు పాక్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన 'సితారా ఎ సుజాత్' అవార్డును ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సాహసంలో తన ప్రాణాలు కోల్పోయిన హసన్ వీరమరణం పట్ల తాను ఎంతగానో గర్విస్తున్నానని యునైటెడ్ ఎమిరెట్స్‌లో పనిచేస్తున్న హసన్ తండ్రి చెబుతున్నారు. అంతేకాదు, పాకిస్థాన్ కోసం తన రెండవ కొడుకుని కూడా త్యాగం చేయడానికి తాను సిద్ధమని చెబుతున్నారు.
కాగా, హసన్ కుటుంబం నివసిస్తోన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రం ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధికారంలో ఉంది. అంతటి సాహసానికి పూనుకున్న హసన్ గురించి పట్టించుకోని తన పార్టీ నేతలపై ఇమ్రాన్‌ఖాన్ మండిపడుతూ వెంటనే ఆ బాలుడి పేరుమీద ఒక స్మారక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బాలుడి సాహసాన్ని మెచ్చుకుంటూ, అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంతర్జాతీయ సాహస అవార్డును బాలుడికి ప్రకటించింది.