: తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఆసీస్ ఘన విజయం
ఓపెనర్ ఫించ్ సెంచరీతో కదం తొక్కడంతో మెల్బోర్న్ లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. బల్లాన్స్ (79), మోర్గాన్ (50)లు హాఫ్ సెంచరీలు సాధించారు. ఆస్ట్రేలియా బౌలర్ మెక్ కే 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 45.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయపతాకం ఎగురవేసింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్లు ఫించ్, వార్నర్ తొలి వికెట్ కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఎనిమిది పరుగుల వద్ద తన క్యాచ్ ను బల్లాన్స్ డ్రాప్ చేయడంతో ఫించ్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 12 ఫోర్ల సహాయంతో 128 బంతుల్లో 121 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వార్నర్ 65 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. సెంచరీ చేసిన ఫించ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.