: ఏఏపీతో కలసి పనిచేస్తాం: జేపీ
ఏఏపీతో ఏదో ఒక రూపంలో కలసి పనిచేస్తామని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తెలిపారు. అయితే రెండు పార్టీల మధ్య మరింత విస్తృతమైన చర్చలు జరగాల్సి ఉందని అన్నారు. దేశంలో మౌలిక మార్పులు రావాలని లోక్ సత్తా, ఏఏపీలు రెండూ కోరుకుంటున్నాయని చెప్పారు. ఈ నెల 16న ఏఏపీతో భేటీ కావడానికి మళ్లీ ఢిల్లీకి వస్తామని తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో కేజ్రీవాల్ తో సమావేశమైన అనంతరం జేపీ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడాలని లోక్ సత్తా ముందు నుంచి చెబుతోందని గుర్తుచేశారు. కొత్త రాష్ట్రాలు ఏర్పాడాల్సిన అవసరం ఉందని... అయితే, దానికోసం ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడం సరికాదని అన్నారు. ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించడం రాజ్యాంగస్పూర్తికి విరుద్ధమని చెప్పారు. రాష్ట్ర విభజనకు సమగ్రమైన పరిష్కారం కావాలని... అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అసెంబ్లీలో చెబుతామని జేపీ తెలిపారు.