: సబ్సిడీ సిలిండర్ల కోటా పెంపుపై కేంద్రం మల్లగుల్లాలు
ఎన్నికలకు మరో నాలుగు నెలలే ఉండడంతో సబ్సిడీ సిలిండర్ల కోటాను 12కు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఒక ఏడాదిలో ఒక ఇంటికి 9 సబ్సిడీ సిలిండర్ల వరకే పరిమితి ఉంది. దీనివల్ల అదనంగా అవసరమయ్యే ప్రతి సిలిండర్ ను రూ. 1,200కు పైగా వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. సాక్షాత్తూ రాహులే రంగంలోకి దిగారు. నిన్న ప్రధానితో భేటీ సందర్భంగా సబ్సిడీ సిలిండర్లను పెంచాలని కోరారు. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీలు పీసీ చాకో, సంజయ్ నిరుపమ్ పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీని కలిసి ఇదే విషయమై వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మొయిలీ మాట్లాడుతూ.. సబ్సిడీ సిలిండర్ల కోటాను 12కు పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పారు. దీంతో కోటా పెంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.