: హార్ట్ ఎటాక్ వస్తుందో రాదో చెప్పేయవచ్చు
గుండెపోటు వస్తుందో రాదో ఇట్టే చెప్పేయవచ్చట. అదేంటి, అదేమన్నా జ్యోతిష్యం చెప్పేదా... గుండెపోటు ముప్పు ఉందో లేదో ముందుగానే ఎలా తెలుస్తుంది? అని మీకు అనుమానం వచ్చిందా... కానీ, అలాంటి కొత్తరకం పరీక్షా విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు గుండెపోటు ముప్పును ముందే పసిగట్టే కొత్తరకం ఫ్లూయిడ్ బయాప్సీ విధానాన్ని అభివృద్ధి చేశారు.
హై`డెఫినిషన్ సర్క్యులేటింగ్ ఎండోథీలియల్ సెల్ (హెచ్డీ`సీఈసీ)గా వ్యవహరిస్తున్న ఈ విధానం ద్వారా గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్నవారి శరీరంలో ప్రవహించే రక్తంలో కనిపించే ఎండోథీలియల్ కణాలను మార్కర్లుగా గుర్తిస్తారు. ఈ విధానం ద్వారా గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవలే గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్నవారిని, ఆరోగ్యంగా ఉన్నవారిని పరీక్షించి వారిమధ్య తేడాను కనుగొనడం ద్వారా ఈ విధానాన్ని రూపొందించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.