: ఈ నవాబ్‌ నిజంగా మృగరాజే!


'మృగరాజు' సినిమాలో హీరో ఒక సింహాన్ని వేటాడతాడు... అలాగే మన రాష్ట్రానికి చెందిన నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌ కూడా వేటాడతాడు. వేట అంటే ఏదో పిట్టల్ని కొట్టడం కాదు... ఏకంగా పెద్ద పులుల్నే! అదేంటి, పులుల్ని వేటాడడం చట్టవిరుద్ధం కాదా?... అని మీకు అనుమానం వచ్చిందా... అతను వేటాడేది ఏదో సరదాకి కాదు... మనుషుల్ని తినే పెద్ద పులుల్ని ప్రభుత్వాల ఆహ్వానాల మీద వెళ్లి మరీ వేటాడతాడు. అంటే ఇలా వేటాడేందుకు లైసెన్సు పొందివున్న వేటగాడు!

ఇప్పటి వరకూ దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆయనగారు తొమ్మిది పులుల్ని తన తుపాకీతో మట్టుబెట్టాడు. ఇప్పుడు ఊటీలో ఒక పులిని లెక్కనుండి తప్పించడానికి వెళ్లాడు. ఇంతలోనే ఆయనకు ఉత్తరప్రదేశ్‌ జిల్లా ప్రభుత్వం నుండి పిలుపొచ్చింది. తమ రాష్ట్రానికి వచ్చి మురాదాబాద్‌, సంభాల్‌ జిల్లాల్లో సంచరిస్తున్న ఒక పులిని మట్టుబెట్టమంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ఉత్తర ప్రదేశ్‌లోని పులి ఇప్పటికే నెలరోజుల్లో ఆరుగురిని పొట్టనబెట్టుకుందట. దీంతో యూపీ ప్రభుత్వం నవాబ్‌ షఫత్‌ అలీఖాన్‌కు పిలుపునిచ్చింది. అయితే ముందుగా ఒప్పుకున్న ఊటీ పులిని మట్టుబెట్టిన తర్వాత యూపీకి వెళతానని అలీఖాన్‌ బదులిచ్చాడు. మొత్తానికి పులి అంటే ఆమడదూరం వెనుదిరిగి చూడకుండా పరుగెత్తే మనలాంటి వారికి అలీఖాన్‌ ధైర్యం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదూ!

  • Loading...

More Telugu News