: 'సెవెన్ ఎ సైడ్ ప్రీమియర్ లీగ్' కు ధోనీ శ్రీకారం
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త ఆటకు శ్రీకారం చుడుతున్నాడు. క్రికెట్లో మరింత పొట్టి ఫార్మాట్ ను తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని సమాచారం. తనకెంతో ఇష్టమైన నెంబర్ 7 పేరిట ఆటకు పేరుపెట్టాలని నిర్ణయించాడు. అతని జెర్సీపై కూడా ఏడవ నెంబరే ఉంటుంది. యూఏఈకి సంబంధించిన ఓ ప్రైవేటు సంస్థ, రితి స్పోర్ట్స్ సంయుక్తంగా 'సెవెన్ ఎ సైడ్ ప్రీమియర్ లీగ్' ను నిర్వహించనున్నాడు. దీనికి చీఫ్ బ్రాండ్ అంబాసిడర్ కూడా ధోనీయే కావడం విశేషం.
ఈ టోర్నీ మొత్తం ఏడు అంకె చుట్టూ తిరగనుంది. ఇందులో మొత్తం 'ఏడు జట్లు' పాల్గొంటాయి. ఒక్కో జట్టులో 'ఏడు'గురు సభ్యులుంటారు. ప్రతి జట్టులో 'ఏడు' దేశాలకు చెందిన క్రికెటర్లు పాల్గొంటారు. ప్రతి మ్యాచ్ 'ఏడు' ఓవర్ల పాటు జరుగుతుంది. బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్ లో చోటు దక్కని ఆటగాళ్లకు ఇందులో ప్రాధాన్యత దక్కుతుందని సమాచారం. అయితే ఈ లీగ్ తో ఐసీసీకి కానీ, బీసీసీఐకి కానీ సంబంధం లేదు. టీమిండియాలో లక్కీ కెప్టెన్ గా పేరొందిన ధోనీకి '7పీఎల్' ఏమేరకు కలిసొస్తుందో చూడాలి!