: పాక్ తీర్మానంపై దద్దరిల్లిన పార్లమెంట్
అఫ్జల్ గురును ఉరితీయడాన్ని వ్యతిరేకిస్తూ పాక్ పార్లమెంట్ గురువారం చేసిన తీర్మానం ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. విపక్ష సభ్యులు పాక్ తీర్మానంపై మండిపడ్డారు. దీనిపై చర్చించాలని బీజేపీ సభ్యుడు యశ్వంత్ సిన్హా లోక్ సభ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. పాక్ తీర్మానాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ సభలో నిలబడి నినాదాలు చేశారు.
శివసేన సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పాక్ చర్య మనకు చెంపెదెబ్బలాంటిదన్నారు. పాక్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటి సారి కాదని, ఇకపై పాక్ ఇలా వ్యవహరించకుండా చెక్ పెట్టాలని కోరారు. విపక్ష సభ్యుల నిరసనలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజివ్ శుక్లా స్పందించారు. పాక్ పార్లమెంట్ లో జరిగిన దానిని ఎవరూ ఆమోదించరని చెప్పారు. పాక్ అలా తీర్మానం చేయరాదని, దానిని ఖండిస్తున్నామని అన్నారు. అయినా సభ్యులు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
మరోవైపు రాజ్యసభలో విపక్ష సభ్యుడు అరుణ్ జైట్లీ కూడా పాక్ తీర్మానంపై నిరసన వ్యక్తం చేశారు. భారత్ లో జరిగిన దారుణ దాడికి పాకిస్థాన్ అధికారికంగా ఆమోదం తెలిపినట్లయిందని అన్నారు. మన సైనికుల తలలు నరకడం, ముంబై మారణహోమం, పార్లమెంట్ పై దాడి కేసు దోషి అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం ద్వారా పాకిస్థాన్ ఉద్దేశాలు స్పష్టంగా వెల్లడయ్యాయని చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ చర్యపై అంతర్జాయంగా నిరసన తెలియజేయాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలు, విశ్వాస పునరుద్ధరణ చర్యలకు ముగింపు పలకాలని సూచించారు.